24, డిసెంబర్ 2015, గురువారం

అభినవ దుర్యోధనుడు - ఆచంట వెంకటరత్నంనాయుడు

అభినవ దుర్యోధనుడు - ఆచంట వెంకటరత్నంనాయుడు
ప్రఖ్యాత రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నంనాయుడు (81) డిసెంబర్ 9, 2015 న   మృతిచెందారు. తెలుగు పౌరాణిక నాటక రంగానికి ఆయన విశేషమైన సేవలందించారు. కృష్ణాజిల్లాకు చెందిన ఆచంట రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస పురస్కారం, నందమూరి తారక రామారావు స్మారక పురస్కారాలను అందుకున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని తనయుడు ఆచంట   బాలాజీనాయుడు వద్ద ఉంటున్న వెంకటరత్నంనాయుడు బుధవారం తాడేపల్లిగూడెంలో కుమార్తెను చూడడానికి వెళ్లి అక్కడే మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే పలువురు రంగస్థల ప్రముఖులు, కళాభిమానులు ఇబ్రహీంపట్నం వెళ్లారు.

అభినవ దుర్యోధనుడిగా..
అభినవ దుర్యోధనుడిగా కీర్తి పొందిన ఆచంట వెంకటరత్నంనాయుడు ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలను అందుకున్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన కళావైశిష్ట్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. తెలుగు నాట దుర్యోధనుడి పాత్రకు జీవం పోసిన ఏకైక రంగస్థల నటుడిగా ఆచంట పేరు తెచ్చున్నారు.

వంద పాత్రల్లో నటించిన ఘనత
ఆచంట తెలుగు రంగస్థలంపై పౌరాణిక, చారిత్రక నాటకాలకు సంబంధించి సుమారు వందకు పైగా పాత్రలను పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా దుర్యోధనుడు, భీముడు, గయుడు, అశ్వత్థామ తదితర పాత్రలను విశేషంగా పోషించారు. ప్రధానంగా జరాసంధుడి పాత్ర ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చింది. ఆచంట వెంకటరత్నంనాయుడు ప్రతినాయక పాత్రలో కూడా ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు. ఆయన షణ్ముఖ నాట్యమండలిని స్థాపించి నాటక రంగానికి మరింత శోభను తీసుకొచ్చారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో తులసీజలంధర, మైరావణ, కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాలు తదితర పలు నాటకాలను తయారుచేసి దేశ వ్యాప్తంగా ప్రదర్శించారు. అమెరికా, సింగపూర్ లోనూ ప్రదర్శనలిచ్చారు.

ఎన్నో పురస్కారాలు, మరెన్నో సత్కారాలు
ఆచంట వెంకటరత్నం నాయుడు కళా వైదుష్యాన్ని మెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించాయి. రాష్ట్రపతి పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2000వ సంవత్సరంలో హంస పురస్కారాన్ని, ఆ తరువాత ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు పలు విశ్వవిద్యాలయాలు   ఆయనను సత్కరించాయి. రాష్ట్రపతి నుంచి పలువురు ప్రధానులు, పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు ఆయనను ఉచిత రీతిన గౌరవించి సత్కరించారు. తెలుగు భాషా వికాసానికి సైతం ఆచంట పాటుపడ్డారు. పద్యం కేవలం తెలుగువారికి మాత్రమే సొంతమని ఆయన దాని విశిష్టతను చాటుతూ భాషావ్యాప్తికి కృషిచేశారు.
ఆచంట వెంకటరత్నంనాయుడు గారి గురించి 64కళలు.కాం లొ ప్రచురించిన వ్యాసం లింక్ లో చదవండి
http://64kalalu.com/old_issues/Dec2012.pdf

అమరావతి ఆర్ట్ సొసైటీ ప్రారంభం......

                             పూర్తి కథనం ఇక్కడ చదవండి........ http://64kalalu.com/katha